Categories
Govt Failures Jobs/TSPSC

TSPSC శల్య సారధ్యం

లక్ష ఉద్యోగాల కాంక్షతో పోరాడిన ఉద్యమం,తెచ్చుకున్న రాష్ట్రం..ఏర్పాటు చేసుకున్న కమీషన్..దానికి అత్యంత ప్రతిభావంతుడు, ఉద్యమకారుడు ఛైర్మెన్..అంతే ఉద్దండపిండాలైన సభ్యులు.మరి అటువంటప్పుడు ఆ సర్వీస్ కమీషన్ పనితీరు ఏ రేంజ్ లో ఉంటుంది..ఇవన్నీ చెపుతుంది టీఎస్పీఎస్సి గురించే.పేపర్ మీద పులులు అని ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ ను అనేది.ఇప్పుడు ఆ వ్యాఖ్య టీఎస్పీఎస్సి కి అచ్చుగుద్దినట్టు సరిపోయితుంది.ప్రభుత్వం ఒక వైపు నియామకాలకు అనుమతులు ఇస్తున్నా,సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది మొదలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.లోపాలు ఒక్కసారి జరిగితే ఒకే కానీ ప్రతీ నోటిఫికేషన్ మీద వివాదాలు రావడానికి అసలు కారణాలు ఏంది??సభ్యులకు ఛైర్మెన్ కు మధ్య మనస్పర్థల?లేక కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం లోలోపల జరుగుతోందా??నీళ్లు,నిధుల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన కేసీఆర్ టీమ్ అసలు సిసలు మాటైన లక్ష ఉద్యోగాల విషయంలో ఇంకా ఎందుకు తడబడుతున్నది??వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపే కొలువుల విషయంలో అసలు టీఎస్పీఎస్సి ఇంకా మొద్దు నిద్ర ఎందుకు వీడడం లేదు.అన్ని నాకే తెలుసు అనే ఛైర్మెన్ బిరుసుతనమా?లేకా సభ్యులు,ఛైర్మన్ మధ్య సమన్వయ లోపమా??ఒకప్పుడు ఏపీపీఎస్సి మీద ఉండే ఉక్రోషం కంటే ఎక్కువ ఇప్పుడు టీఎస్పీఎస్సి మీద ఉంది.సర్వీస్ కమీషన్లు అన్నీ ఇంతే అనే స్థాయికి దిగజారిపోయింది టీఎస్పీఎస్సి..

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు పాత జిల్లాల ప్రకారం విడుదల చేసి.. టీచర్‌ పోస్టులు కొత్త జిల్లాల ప్రకారం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యర్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జిల్లాల పెంపుతో స్థానికతకు ఏమాత్రం భంగం వాటిల్లదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించడం..కొన్ని జిల్లాలకు పోస్టులు కేటాయించకపోవడం అక్కడి అభ్యర్థులను తీవ్రమనోవేదనకు గురిచేస్తోంది. అయితే స్థానికేతరులకు 20శాతం అవకాశం ఉండటం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

గ్రూప్‌2 పరీక్షల్లో వైటెనర్‌ విషయంలో తెలివితక్కువగా వ్యవహరించిందన్న ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ, ఇటు గ్రూప్‌1 ఫలితాల వెల్లడిలోనూ ఏకంగా టాప్‌ ర్యాంకర్‌ల పోస్టింగ్‌లనే సరిచూసుకోలేక పోయిందంటే కమిషన్‌ ఆదినుంచీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందంటున్నారు విద్యార్థులు. అయితే, ఇప్పుడు కమిషన్‌ నెపాన్ని సీజీజీ పైకి నెడుతోంది. నిజానికి కమిషన్‌కు సమర్ధులైన సభ్యులను నియమించినప్పటికీ లోపాలు జరుగుతుండడం గమనార్హం. పైగా టీఎస్పీఎస్సీ కూడా అక్రమాలు అవకతవకల కమిషన్ అన్న ముద్ర వేసుకుంటోందనే ఆందోళన అప్పుడే మొదలైంది. ఇన్నేళ్లలో సక్సెస్‌ఫుల్ గా నిర్వహించిన పరీక్ష గాని ఫలితాలు గాని లేకపోవడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే ఉమ్మడి రాష్ట్రంలో ఏపిపిఎస్‌సికి పట్టిన గతే టీఎస్పీఎస్సీకీ పడుతుందని అభ్యర్ధులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా పైకి కమిషన్‌ను మెచ్చుకుంటున్నా.. అంతర్గతంగా, వారి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *